Skip Navigation Links
హోం పేజీ
ప్రవచనములు
స్తోత్రములు
వీడియోలు
**CDs/DVDs**
సంప్రదించండి
English
Skip Navigation Linksమొదటి పేజీ » హోం పేజీ   

news

-
శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవములు ఈ నెల 21 మరియు 22 తేదీలలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవ వేడుకలపై మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా!! చాగంటి కోటేశ్వర రావు శర్మ గారి ప్రవచనములు, తరువాత 23వ తేది నుండి 29వ తేది వరకు "శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవములు" విశాఖపట్నంలో నిర్వహించు చున్నారు.
శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవములు అంటే : తిరుమలలో స్వామి వారికి ప్రతీ ఉదయం నుంచి రాత్రి పవళింపు సేవ వరకు ( ఆదివారం నుంచి శనివారం వరకు ) జరిగే అన్ని సేవలు, నివేదనలు, అభిషేకములు, మన పూజ్య గురువుల మార్గదర్శనంలో, మనం విశాఖలోనే దర్శించే మహద్భాగ్యం. సన్నిధి గొల్ల రావడం, ఆలయం తెరవడం, ప్రధమ దర్సనం చేయడం, సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్ర దీపాలంకార సేవ, వివిధ ఆరాధనలు, ఘంటా నాదం, పవళింపు సేవ, ఇంకా మనకి తెలియని ఎన్నో సేవలు, ఆరాధనలు, తిరుమలలో ఎలా జరుగుతాయో అలాగే మనందరికీ మన విశాఖలో దర్సిమ్పచేసే గొప్ప అద్భుత కార్యక్రమం.
వేదిక : స్వర్ణ భారతి ఇన్డోర్ ఆడిటోరియం, పుల్లయ్య కాలేజీ వెనుక, విశాఖపట్నం
ప్రవచన సమయం : సాయంత్రం 6.30 ని
-  Nov 02, 2013 - నవంబరు నెలలో పూజ్య గురువుల ప్రవచనముల వివరములకు కాలెండర్ విభాగము చూడగలరు

Jun 10, 2013 - పూజ్య గురువుల ప్రవచనములు CD/DVDలలో పొందుటకు, మరియు ప్రవచనముల జాబితాకు ఈ వెబ్ సైటులోని ’CD/DVDs' విభాగాన్ని చూడగలరు http://telugu.srichaganti.net/SriGuruVaani.aspx


Subscribe To RSS rss
welcome

శ్రీ గురుభ్యో నమః

పరమ పూజ్యులు, ప్రాతః స్మరణీయులు, వేదమే ప్రమాణముగా, సనాతన ధర్మమును స్వయంగా అనుష్ఠిస్తూ, అసమానమైన శారదా కటాక్షముతో, వారి వాక్ధాటితో యావత్ తెలుగు లోకానికీ సనాతన ధర్మమును బోధిస్తూ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది తెలుగు భక్తులను ధర్మాచరణము నందు అనురక్తులను చేస్తున్న వారు, అపర శంకరాచార్యులుగా, కాకినాడ శంకరుడిగా ఎంతోమంది శిష్యులచేత ఆరాధింపబడుతున్న మహనీయుడు పూజ్య బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. పూజ్య గురువు గారు తెలుగునాట పుట్టడం, తెలుగువారు చేసుకున్న అదృష్టం. వీరు కాకినాడ వాస్తవ్యులు. వీరి తండ్రి గారు పూజ్య శ్రీచాగంటి సుందరశివరావు గారు, తల్లిగారు శ్రీమతి సుశీలమ్మ గారు. పూజ్య గురువు గారి ధర్మపత్ని శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారు, వీరికి ఇద్దరు సంతానము. పూజ్య గురువు గారు ఒక్క కాకినాడలోనే కాకుండా, ఆంధ్రదేశములో అనేక చోట్ల, తమిళనాడు, కర్ణాటక మరియు ఉత్తర భారతదేశములలో కూడా ఆధ్యాత్మిక ప్రవచనములు చేసి ఉన్నారు. వీరు, మండల దీక్షతో సంపూర్ణ శ్రీరామాయణము, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహాపురాణాన్ని, 40 రోజుల పాటు శ్రీలలితా సహస్రనామముపైన, మహాభారతములోని ఆదిపర్వము, విరాటపర్వము, సభాపర్వము మరియు అరణ్య పర్వములపైన ప్రవచనములు చేసి ఉన్నారు. ఇవే కాకుండా, రామాయణ వైభవము, మహేశ్వర వైభవము, కామాక్షీ వైభవము, సుబ్రహ్మణ్య వైభవము, గురు వైభవము, ఆదిశంకరులు మొదలుకొని అనేక మంది జగద్గురువుల వైభవము, శ్రీగురుచరిత్ర, శ్రీషిరిడీ సాయి వైభవము, శ్రీవేంకటేశ్వరస్వామి వైభవము, అయ్యప్ప వైభవము, సౌందర్యలహరి, మూకపంచశతి, శివానందలహరి, కనకధారా స్తోత్రం మొదలగు అనేక స్తోత్రముల వైభవము, పుణ్య క్షేత్రముల వైభవము, గోమాత యొక్క విశిష్టత మొదలైన అనేక అంశాలపైన, గురువు గారు ఆధ్యాత్మిక ప్రవచనములు చేసి ఉన్నారు.

పూజ్య గురువు గారు ప్రవచనం చెప్పడం అంటే అది వారొక తపస్సుగా భావించి, ఆ చెబుతున్న విషయంలో మమేకమై, అనన్య సాధారణమైన వాక్పఠిమతో, వింటున్న భక్తుల యొక్క హృదయాలలో బాగా నాటుకునేటట్లు, ఇప్పటి వరకు మన పురాణేతిహాసముల పట్ల ఎంతో మందికి ఉన్న మూఢనమ్మకములను నిర్మూలించి, "విన్నది ధర్మం కాదు-ఆచరణలో పెట్టినది ధర్మం" అని, సనాతన ధర్మము యొక్క విశిష్ఠతను బోధించే మహాపురుషులు వారు.

పూజ్యగురువు గారు "శారదా జ్ఞానపుత్ర", "సనాతన ధర్మ రత్నాకర" మరియు "ప్రవచన చక్రవర్తి" అనే బిరుదులతో సత్కరింపబడ్డారు. ప్రపంచవ్యాప్తముగా వీరి ప్రవచనములను విని, వారి జీవితములను గురువు గారి బోధలకు అనుగుణంగా మలచుకొని, ఆధ్యాత్మిక అనుష్ఠానాన్ని ప్రారంభించిన వారు అనేక మంది ఉన్నారు. పూజ్య గురువు గారి వాక్కు సింహనాదమే. పూజ్య గురువు ఏ విషయాన్నైనా భావ, అంతర్గత, నిక్షిప్త అర్ధాలతో సహా మేళవించి, సనాతన ధర్మములో మన ఋషులు ఇచ్చిన జీవన విధాన శైలిని, ఋషులు ఇచ్చిన వాఙ్మయమును, ఇప్పుడు ఇక్కడ మన నిత్య జీవితములో అనుష్టించి, ఏ విధంగా జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చో అత్యత్భుతంగా చెప్తారు. పుణ్య క్షేత్రాలను ఎలా దర్శించాలో, తీర్థ యాత్రలలో ఏవి తప్పనిసరిగా చూడాలో మొదలైన తీర్థక్షేత్ర దర్శనా విధివిధానలను సకల జనులనూ ప్రభావితం చేసేలా పూజ్య గురువు గారు చెప్తూ ఉన్నారు. పూజ్య గురువు గారి అమృత వాక్కులను విని, ఆచరణలో పెట్టే ఎవరికైనా కలిమాయ అంటదు, వారు సదా ఈశ్వర/గురు కృపకి పాత్రులై ధన్యులవుతారు.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కేవలం ఆధ్యాత్మిక ప్రవచనములే కాక, చదువుకునే విద్యార్థులను ఉద్దేశించి, అనేకచోట్ల వ్యక్తిక్త్వ వికాసముపై ప్రవచనములు చేసి ఉన్నారు, గురువు గారి అమృత వచనములు విన్న అటువంటి ఎంతో మంది విద్యార్థులు ప్రభావితమై, వారి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నారు.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములను ఎంతో మంది యుక్త వయసులో ఉన్న పిల్లలు, దేశవిదేశాలలో వృత్తిరీత్యా ఉన్నత స్థానాలలో ఉన్న అనేక మంది ఉద్యోగస్తులు, పూజ్య గురువు గారి ప్రవచనములను ప్రతీ రోజూ, వింటూ ఉన్నారు. కేవలం గురువాక్యములను విన్నంత మాత్రాన, గురుమండలరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహంతో వారికి రాబోయే విపత్తుల నుంచీ రక్షింపబడినవారు ఎంతో మంది భక్తులు ఉన్నారు. పూజ్య గురువు గారి ప్రవచనములు అంటే, అది కేవలం వారి యొక్క అనన్య సాధారణమైన ధారణా శక్తి, వాక్పటిమలు మాత్రమే కాదు, నిజానికి వారి యొక్క తపశ్శక్తిని ఇలా వాగ్రూపములో భక్తులకు జ్ఞానామృతమును పంచిపెడుతున్నారు. ఇన్ని ప్రవచనములు చేసినా, వారు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ప్రతిఫలాన్ని తీసుకోకుండా, ఎటువంటి కీర్తి, ప్రతిష్టలకు తాదాత్మ్యత చెందకుండా, అన్నిటినీ ఈశ్వర ప్రసాద భావంతో జీవించే నేటి కాలపు ఋషి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. వారు నిస్సందేహముగా కారణ జన్ములు.

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.

వారు ఇచ్చిన ప్రవచనములను అందరికీ అందుబాటులో ఉంచాలని చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం శ్రీచాగంటి.నెట్.

couple

చాగంటి దంపతులు

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దంపతుల దివ్య ఆశీర్వచనములతో ఈ వెబ్ సైటు లో మీకు ఎప్పటికప్పుడు అన్ని రకముల ఆథ్యాత్మిక అమృత ప్రవచనములను, పూజ/భక్తికి సంబంధించిన వివరములను, అనేకమైనటువంటి ఆసక్తికరమైన విశేషములను మీకు అందజేయాలని సంకల్పిస్తూ మా ఈ యజ్ఞాన్ని సహృదయముతో ఆదరిస్తూ ఆశీర్వదించమని సదా మిమ్ములను కోరుకుంటూ...
సదా మీ సేవలో
శ్రీచాగంటి.నెట్